మనలో చాలా మందికి తల్లిదండ్రులను ప్రేమించడం తెలుసు, పిల్లలను ప్రేమించడం తెలుసు, తోబుట్టువులు ( బ్రదర్స్ or సిస్టర్స్ ) ను ప్రేమించడం తెలుసు, మన జీవిత భాగస్వామిని ప్రేమించడం తెలుసు. కానీ మీకు తెలియనిది “How To Love Yourself“.
లవ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించడం. మనల్ని మనం ప్రేమించడం స్వార్ధం అవుతుంది కదండీ అని అంటారేమో అలా ఎప్పటికీ కాదు.
మన కుటుంబ సభ్యులను, మన తోటివారిని లేదా మనతో పాటు పనిచేసే తోటి ఉద్యోగులను పట్టించుకోకుండా మనకు కావలసినవి మాత్రమే చేసుకుంటూ మన పనులు మాత్రమే చూసుకుంటూ మనం మాత్రమే అన్నీ తింటూ ఎవ్వరి అవసరాలని పట్టించుకోకుండా వుంటే దానిని స్వార్ధం అంటారు.
మనకి కావలసిన వారికి అందరికీ ఏం అవసరమో, వారి ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకుని వారికి కావలసినవి అన్నీ చేస్తూ వారి గురించి ఆలోచిస్తూ వుండడమే కాకుండా, మన స్వంత అవసరాలను చూసుకోవడం మరియు ఇతరులను సంతోషపెట్టడానికి మనం కష్టాలలో పడకుండా చూసుకోవడం, మన ఆనందం పట్ల మనకి కొంచెమైనా ఆలోచన కలిగి ఉండటాన్నే మనల్ని మనం ప్రేమించడం అంటారు. దీనినే సెల్ఫ్ కేరింగ్ గా కూడా పిలవవచ్చు.
ఇప్పడు మీకు మనల్ని మనం ప్రేమించుకోవడానికి, స్వార్ధంగా వుండడానికి మధ్య తేడా అర్దం అయ్యింది అనే అనుకుంటున్నాను.
మనల్ని మనం ఎందుకు ప్రేమించాలి అనే దానికి మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను.
ఒక స్త్రీ తన భర్తని పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. వారికి ఏం కావాలన్నా క్షణాల్లో అమర్చిపెడుతూ వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా వుండేలా ఎన్నో జాగర్తలు తీసుకుంటూ వుండేది. ఆ క్రమంలో తన గురించి శ్రద్ద తీసుకోవడం మర్చిపోయింది. కనీసం టైంకి ఆహారం కూడా తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిని బాగా నీరసించి పోయింది. డాక్టర్లు టెస్ట్ చేసి కనీసం ఒక మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు.
ఆమె భర్తది చిన్న ప్రవేట్ ఉద్యోగం కావడం అన్ని నెలలు సెలవు ఇవ్వడం కుదరదు అని అనడంతో అతను జాబ్ మానేయాల్సి వచ్చింది. ఇంటి అద్దె కట్టడానికి గానీ ఇంట్లో ఖర్చులకి కానీ మెడిసెన్స్ కు కానీ ఇలా ఎన్నో అప్పులు చేయాల్సి వచ్చింది. అవన్నీ చూశాక ఆ స్త్రీ చాలా బాధ పడింది నా గురించి నేను శ్రద్ద తీసుకుని వుంటే ఇలా జరిగి వుండేది కాదేమో అని.
ఇలా స్త్రీల విషయంలోనే కాదు చాలా మంది పురుషులు కూడా జాబ్ లో బిజీ గా వుండి, బిజినెస్ లో పడిపోయి వారి గురించి వాళ్ళు ఆలోచించడం శ్రద్ద తీసుకోవడం మానేస్తారు, తర్వాత ఏదైనా జరిగితే ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది? అని ఆలోచించి అతిగా బాధ పడతారు.
అందరి విషయంలో ఇలా జరగాలి అని కానీ జరుగుతుంది అని కానీ నేను అనడం లేదు కానీ జరిగే అవకాశాలు వున్నాయి అని చెప్తున్నాను. గతాన్ని మనం మార్చలేము, భవిష్యత్తు లో ఏం జరుగుతుందో అది మన చేతిలో లేదు. కేవలం వర్తమానం మాత్రమే మన చేతిలో వుంటుంది.
మనల్ని మనం ప్రేమిస్తే మన గురించి మనం చాలా శ్రద్ద తీసుకుంటాం. అప్పుడు మనం సంతోషంగా & ఆరోగ్యంగా వుంటాము.
ఇప్పుడు వున్న పరిస్థితుల్లో ఎవరో మన గురించి శ్రద్ద తీసుకోవడం అనేది జరిగే పని కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బిజీ బిజీ గా వుంటున్నారు. కాలం తో పాటే మనమూ పరిగెట్టాలి తప్పదు కదా? ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల గురించి శ్రద్ద తీసుకోవడమే కాకుండా వారి గురించి వారు శ్రద్ద తీసుకుంటే మనమూ మన కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు. అవునంటారా ? కాదా?
ఎల్లప్పుడూ మీతో ఉండే ఏకైక వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా? అయ్యో ఎక్కువగా ఆలోచించకండి నేనే చెప్తాను. ఎవరో కాదండీ మీరే! ఎల్లప్పుడూ మీతో వుండేది మీరే. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు.
మనకి బాగా ఇష్టమైన వాళ్ళు కొన్ని సార్లు మనల్ని పట్టించుకోకపోవచ్చు. మనం బ్రతికున్నా చచ్చిపోయినా వారికేం సంబంధం లేదు అనేలా ప్రవర్తించవచ్చు. మనం మేలు చేసిన వారు కూడా మనకు కీడు చేయడానికి చూడవచ్చు. మనం చాలా మంచివారు అనుకున్న వాళ్ళు మనం ఊహించనంత చెడ్డ వాళ్ళు అయ్యి వుండవచ్చు. ఎవరు ఎలా వున్నా, ఎవరు ఎలాంటి వారు అయినా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మనతో వున్నా లేకపోయినా మనం బ్రతకాలి.
జీవితంలో ఎదురైయ్యే కష్టనష్టాల్ని, ఒడిదుడుకులను, అనారోగ్యాలను అన్నిటినీ ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ మనం బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే మనల్ని మనం ప్రేమించాలి.
1. మీ మనస్సు ఏంటో మీరు తెలుసుకోండి
2. మిమ్మల్ని ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు
3. మీతో మీరు నిజాయితీగా ఉండండి
4. మీ విజయాలను వ్రాయండి
5. మీ బలాన్ని తెలుసుకోండి
6. మీ విలువను మీరే గుర్తు చేసుకోండి
7. మీ హెల్త్ ని బాగా చూసుకోండి
8. మీ కోసం మీరు నిలబడండి
9. మీ కోసం కొంత సమయం కేటాయించండి
10. కొంతమంది మిమ్మల్ని ఇష్టపడరని అంగీకరించండి
నిస్వార్థంగా ఉండటం చాలా ముఖ్యం అని సమాజంలో అందరూ తరచుగా మనకు చెబుతూ ఉంటారు. ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడం, ప్రియమైన వారిని మొదటి స్థానంలో ఉంచడం వారి కోసమే బ్రతకడం మంచిదని అంటూ వుంటారు కానీ మన గురించి మనం ఆలోచించుకోకపోతే మనల్ని మనం ప్రేమించుకోకపోతే మన జీవితం చాలా నిస్సారంగా వుంటుంది. అందుకే ఇక ముందు అయినా మనల్ని మనం ప్రేమించుకోవడం అలవాటు చేసుకుందాం!
మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా మీకు వేటికి సంభందించిన డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.